ఆ ఒప్పందం జరిగితేనే భారత్‌తో బంధం.. బంగ్లాదేశ్‌ కొత్త మెలిక!

  • గంగా నది ఒప్పందంపైనే ఇరుదేశాల బంధమన్న బంగ్లా
  • డిసెంబర్‌లో ముగియనున్న పాత ఒప్పందం గడువు
  • పద్మా నదిపై బంగ్లాదేశ్ మెగా ప్రాజెక్టు
  • తీస్తా వివాదంపై మమతా బెనర్జీపై విమర్శలు
భారత్‌తో సంబంధాలు కొనసాగడం గంగా నది నీటి పంపకాల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుందంటూ బంగ్లాదేశ్ కొత్త మెలిక పెట్టింది. ఈ మేరకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం కోసం చర్చలు జరపాలని భారత్‌ను డిమాండ్ చేసింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండో-బంగ్లాదేశ్ గంగా నది నీటి ఒప్పందం 1996లో జరిగింది. అప్పటి ప్రధాని షేక్ హసీనా హయాంలో కుదిరిన ఈ డీల్‌ ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది. కొత్త ఒప్పందం కుదిరే వరకు పాత ఏర్పాట్లే కొనసాగాలని బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ పేర్కొన్నారు.

భవిష్యత్తులో జరిగే నీటి ఒప్పందాలకు కాల పరిమితి ఉండొద్దని ఆలంగీర్ షరతు విధించారు. గంగా నదిని బంగ్లాదేశ్‌లో పద్మా నదిగా పిలుస్తారు. అక్కడి వ్యవసాయం, పర్యావరణం, తాగునీటి వ్యవస్థలకు ఈ నది ఎంతో కీలకం. బంగ్లాదేశ్‌లోని మూడో వంతు జనాభా జీవనోపాధి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారు.

ఫరక్కా బ్యారేజ్ వల్ల తమకు ఎండాకాలంలో నీటి ప్రవాహం తగ్గిపోతోందని బంగ్లాదేశ్ తెలిపింది. దీనివల్ల నదుల్లో ఉప్పునీరు చేరి పంటలు దెబ్బతింటున్నాయని వాదిస్తోంది. మరోవైపు కోల్‌కతా పోర్టు రక్షణ కోసమే ఫరక్కా బ్యారేజ్ నిర్మించినట్లు భారత్ మొదటి నుంచి చెప్తోంది.

ఈ ఇబ్బందులను అధిగమించే పేరిట బంగ్లాదేశ్ పద్మా నదిపై ఓ మెగా బ్యారేజ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇది 2033 నాటికి పూర్తి చేయాలని ప్రధాని తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ బ్యారేజ్ నిర్మాణంపై భారత్‌తో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ ఏకపక్షంగా నిర్ణయించింది.

మరోవైపు తీస్తా నది నీటి ఒప్పందంపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరును కూడా బీఎన్‌పీ నేతలు ఇటీవల విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సువేందు అధికారి నాయకత్వంలో చర్చలు మళ్లీ మొదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నీటి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఇరు దేశాల మధ్య ప్రత్యేక వేదికలు ఉన్నాయని భారత్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య ప్రవహించే 54 నదులపై క్రమబద్ధంగా చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల ప్రతినిధులు నిరంతరం సమావేశమవుతూనే ఉన్నారని స్పష్టం చేసింది.

Sheikh Hasina
Ganga River
Bangladesh
India
Water Sharing Agreement
Padma River
Farrakka Barrage
Teesta River
Mamata Banerjee
Indo Bangladesh relations

More Telugu News